పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మొన్న 24 గంటల వ్యవధిలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన నలుగురు కీలకమైన ప్రముఖులు పవన్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ పరిణామాలపై సహజంగానే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అన్వయించుకుని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఒక సారి చూద్దాం.
కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రెండు అగ్ర ఛానల్స్ అధినేతలు అయిన టీవీ9 రవిప్రకాష్, ఎన్ టీవీ చౌదరి పాల్గొన్నారు. రవిప్రకాష్ మాట్లాడుతూ, ఇటీవల తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా మారానని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పవన్ లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా అవసరమని చెప్పారు. ‘రాజకీయాలకు సంబంధించి సమస్యలపై పోరాడతాను - రాజ్యాధికారం తనకు లక్ష్యం కాదు’ అంటున్న పవన్ వ్యవహారశైలి తనకు బాగా నచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో, పెద్దనోట్ల రద్దు విషయంలో పవన్ కేంద్రాన్ని బాగా నిలదీశారని చెప్పారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు సమయంలో అందరూ మౌనంగా ఉండగా పవన్ ఒక్కరే గొంతు విప్పారని అన్నారు. రవిప్రకాష్ ఈ మాటలు మాట్లాడుతున్నంతసేపూ పవన్ ఆసక్తిగా విన్నారు. రవిప్రకాష్ వేదికపైనుంచి దిగివచ్చిన తర్వాత ఆయనను పవన్ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాను వేదికపైకి వెళ్ళేటప్పుడుకూడా రవిప్రకాష్‌కు చెప్పి వెళ్ళారు. వేదికపైకూడా రవిప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంమీద టీవీ9 సీఈఓ మాటలపై పవన్ బాగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. తర్వాత మాట్లాడిన ఎన్ టీవీ చౌదరి కూడా పవన్‌పై ప్రశంసలు కురిపించారు.
కాటమరాయుడు ఫంక్షన్ జరిగిన మరుసటిరోజు వచ్చిన ‘ఈనాడు’ దినపత్రిక ఆదివారం అనుబంధం పుస్తకంలో పవన్‌పై ముఖచిత్ర కథనం వెలువరించారు. నాలుగు పేజీల ఆ కథనంలో పవన్ జీవితాన్ని అనేక కోణాలలో స్పృశించారు. తెలుగుదేశం పార్టీకి కరపత్రికలాంటిదయిన ఈనాడు పత్రిక పవన్‌పై ఇంత ప్రత్యేకంగా కథనం రాయటం కూడా ఒక విశేషమే.
ఇక నాలుగో పరిణామం ఆదివారం(మార్చి 19) సాయంత్రం చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనధికారిక ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ పాల్గొన్నారు. పవన్ గురించి ఆర్కే రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, పవన్ మంచి వ్యక్తి అని, ఆయనతో నాలుగైదుసార్లు తాను ఇంటరాక్ట్ అయ్యానని చెప్పారు. ఆయన మంచి అంశాలనే ప్రశ్నిస్తున్నారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మెగా ఫుడ్ పార్క్ విషయంలోకూడా పవన్ ప్రస్తావించిన అంశం సరైనదేనని, అయితే పర్యావరణానికి హాని కలిగించకుండా ఆ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని తాము సూచిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద అన్నీ పాజిటివ్‌గానే తప్ప ఒక్క వాక్యం కూడా నెగెటివ్ కూడా మాట్లాడకపోవటం గమనించాల్సిన విషయం.
ఈ నాలుగు పరిణామాలపై అనేక రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఒన్ ఇండియా(thatstelugu.com) అనే ప్రముఖ వెబ్ సైట్ దీనిపై వార్త రాస్తూ, టీడీపీ ప్రభుత్వంపట్ల జనంలో మొదలైన వ్యతిరేకతను పచ్చ మీడియా గమనించిందని, అందుకనే పవన్ పైవు మారిందని పేర్కొంది. ఈ వ్యతిరేకత జగన్ వైపు వెళ్ళనీయకుండా చూడాలని ఈ మీడియా ప్రయత్నిస్తోందని రాసింది. పవన్‌కు హైప్ ఇవ్వటం ద్వారా జగన్‌ను తెరమరుగు చేయొచ్చని వారి వ్యూహమని పేర్కొంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని కూడా రాసింది.
ఈ పరిణామాలు పవన్ అభిమానుల్లో పెద్ద చర్చకే దారితీశాయి. టీవీ 9, ఎన్ టీవీ, ఈనాడు వంటి అగ్రస్థాయి మీడియా సంస్థలకు పవన్‌పై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకురావటానికి కారణం ఏదో కుట్రేనని మండిపడుతున్నారు. రవిప్రకాష్ చంద్రబాబు దూత అని, కోవర్ట్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ తెలుగు మీడియాకు(ముఖ్యంగా ఈ ముగ్గురు మీడియా అధినేతలకు) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావటానికి కారణం - అతనిపట్ల జనంలో విశ్వసనీయత పెరగటం అన్నది అందరికీ తెలిసిన విషయమే. రాజధాని అమరావతి రైతులుగానీ, చేనేత కార్మికులుకానీ, ఇటీవలికాలంలో నెల్లూరు యూనివర్సిటీ విద్యార్థులుగానీ పవన్‌కు చెప్పుకుంటే తమ సమస్యలకు గుర్తింపు వస్తుందని భావించటం అతనికి ఉన్న జనాదరణను చెప్పకనే చెబుతోంది. మీడియాలో ఎంత వ్యతిరేకులు ఉన్నప్పటికీ ఒక కీలకమైన సంఘటన చోటుచేసుకుంటే దానిని వార్తగా ఇవ్వక తప్పదు… మరీ సాక్షిలాంటి సొంత పార్టీ పత్రిక అయితే తప్ప. ఆ క్రమంలోనే పవన్‌ను ఎంత వ్యతిరేకించేవారయినా అతని వార్తలు ఇవ్వక తప్పదు.
ఈ సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారానికి రాకముందు చేసిన పాదయాత్రను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన పాదయాత్రకు వెళ్ళినచోటల్లా విపరీతమైన స్పందన వచ్చేది. అప్పట్లో సాక్షి పత్రిక కూడా లేదు. ఇప్పుడు పచ్చమీడియాగా చెబుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు, ఈటీవీ 2, టీవీ 9 ఛానల్సే ఉండేవి. అయినాకూడా పాదయాత్ర వార్తలు ఇవ్వక తప్పేదికాదు. ఈ వ్యాసకర్త నాడు ఈనాడులో పనిచేస్తూ ప్రత్యక్షంగా గమనించిన విషయం ఇది. కాబట్టి మీడియా తొక్కేయటానికి అవకాశం ఉండదు. అయితే పార్టీ కార్యక్రమాలను, భావాలను బలంగా ప్రచారం చేసుకోవటానికి సొంత మీడియా అనేది ఇప్పుడు ప్రతి పార్టీకి అవసరం, ప్రజరాజ్యం పార్టీకి నాడు సొంతమీడియా ఉంటే కనీసం మరో 5-10 స్థానాలు వచ్చేవి… చిరంజీవి కనీసం కింగ్ మేకర్ అయినా అయ్యేవారు. అయితా మీడియా విషయాన్ని నిర్లక్ష్యం చేసి మూల్యాన్ని చెల్లించుకున్నారు.
అయినా రవిప్రకాష్ మొన్న కాటమరాయుడు ఫంక్షన్లో మాట్లాడిన విధానం చూస్తుంటే జెన్యూన్‌గానే ఉంది… అభద్రతాభావంతో చూస్తే కోవర్ట్‌గా కనిపిస్తుందేమోగానీ. ఒకవేళ అతను కోవర్ట్ అయినాకూడా, అలాంటి వాళ్ళను పవన్ హేండిల్ చేయలేకపోతే, రేపు అధికారం చేతిలోకి వస్తే ఎలా నెగ్గుకొస్తాడో అభిమానులే చెప్పాలి.
